SAILOO… Not a name, but a brand..


SAILOO… Not a name, but a brand..

Boosters as this, Keeps us going… Thanx a lot.

శైలూ… పేరు కాదు ఒక బ్రాండ్‌

మహిళల జీవితాల్లో పెండ్లి ఓ పెద్ద మలుపు. కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యేవాళ్లు కొందరైతే… బాధ్యతలను మోస్తూనే తమదైన జీవితాన్ని నిలబెట్టుకునేవాళ్లు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ముందుంటారు…

శైలజ చెరువు. వేడుక ఏదైనా తీపి ఉండాల్సిందే. తీపినిచ్చే చాక్లెట్స్‌.. మార్కెట్‌లో ఎన్నో ఉన్నాయి. కానీ ఇంట్లో చేసే చాక్లెట్స్‌ ఇచ్చే టేస్టే వేరు. ఆ రుచిని ఆత్మీయంగా అందిస్తున్నారు శైలజ… ‘శైలూ చాక్లెట్స్‌’తో. విజయవంతంగా సాగిపోతున్న ఆమె వ్యాపార ప్రయాణం గురించి….
శైలజ చెరువు… బేగంపేట్‌ ఉమెన్స్‌ డిగ్రీ కాలేజీలో చదివింది. బీకామ్‌ కంప్యూటర్స్‌ చదివిన ఆమె కొన్నాళ్లు ప్రోగ్రామర్‌గా పనిచేసింది. అప్పటిదాకా కంప్యూటర్స్‌ మాత్రమే ఆమె ఫ్యాషన్‌. పెండ్లయిన ఒక కొడుకు పుట్టిన తరువాత ఉద్యోగం చేయడం కష్టమైంది. చిన్నప్పటినుంచి యాక్టివ్‌గా ఉండేది. ఖాళీగా ఉండటం ఆమె డైరీలోనే లేదు. అలా అని ఇంట్లో వ్యాపారం చేసినవాళ్లు ఎవరూ లేరు. అంతా ఉన్నత విద్య, ఉద్యోగాల్లో ఉన్నవారే. అయినా ఫ్రెండ్స్‌ అందరితో కలిసి చిన్న చిన్న బిజినెస్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బట్టలమ్మింది. టైలరింగ్‌ యూనిట్‌ నడిపింది. కానీ దేంట్లోనూ ‘ఇది కంటిన్యూ చేయగలను’ అనిపించలేదామెకు.

కుకింగ్‌పై ఉన్న ఆసక్తితో…

చిన్నప్పటినుంచి కుకింగ్‌ అంటే ఆసక్తి. కొడుకుకోసం కొత్తకొత్త వంటకాలు చేసి పెడుతుండేది. కానీ… కుకింగ్‌ అనేది కెరీర్‌గా మారుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ జీవితం ఇంతే అనుకునే కొన్ని రోజులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. అప్పుడే డిప్రెషన్‌కు వెళ్లిపోయేవారు కూడా ఉంటారు. అక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. అలా డిప్రెస్‌డ్‌గా ఉన్న సమయంలో… కుకింగ్‌, బేకింగ్‌పైన ఉన్న ఆసక్తితో బేకింగ్‌ క్లాసెస్‌కు వెళ్లింది. అప్పుడే ఆమెకో ఆలోచన వచ్చింది. ‘చాక్లెట్స్‌ ఎందుకు ప్రిపేర్‌ చేయకూడదు?’ అని. పిల్లలకు, పెద్దవాళ్లకు చాలా ఇష్టం. నోట్లో పెట్టగానే మెల్ట్‌ అయిపోతాయి. డయాబెటిస్‌ ఉన్నవాళ్లకు సైతం డార్క్‌ చాక్లెట్‌ తింటే సమస్య ఉండదు. ఇవన్నీ ఆలోచించి ‘ఏదేమైనా… ఐకెన్‌ డు!’ అని చాక్లెట్‌ మేకింగ్‌ ప్రారంభించింది.

గల్లీ గల్లీ తిరిగి…

అప్పుడు ఆమెకు అందులో ఓనమాలు కూడా తెలియదు. చాక్లెట్‌ మేకింగ్‌కి అవసరమయ్యేవి ఎక్కడ దొరుకుతాయో తెలుసు. కానీ ప్యాకింగ్‌ ఎలా? అందుకే హౌల్‌సేల్‌ మార్కెట్‌కు వెళ్లి గల్లీ గల్లీ తిరిగింది. అన్నీ తెలుసుకోవడం కోసం చాలా కష్టపడింది. మొత్తానికి ప్రాసెసింగ్‌ అయిపోయింది. కానీ మార్కెటింగ్‌ కష్టం. తెలిసినవాళ్లకు ఇస్తే తిని బాగుందని చెబుతారు. కానీ అమ్మకాలు ఎలా? మొదటినుంచి టెకీసావీ అయిన శైలజ… అప్పటినుంచే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది. అప్పట్లో ఉన్న ఆర్కుట్‌లో తన చాక్లెట్స్‌ ఫొటోలు అప్‌లోడ్‌ చేసేది. జస్ట్‌ డయల్‌ కూడా ఆ మధ్యనే కొత్తగా వచ్చింది. దాంట్లో కూడా రిజిస్టర్‌ చేసుకున్నది. అలా 2008లో పూర్తిస్థాయిలో ‘శైలూ చాకోస్‌- ఎ బండిల్‌ ఆఫ్‌ జారు’ పేరుతో చాక్లెట్స్‌ బిజినెస్‌లోకి ఎంటరయ్యింది.

పర్సనలైజ్‌డ్‌ ప్రత్యేకతగా…

మొదట చిన్నచిన్న అవకాశాలు వచ్చాయి. తనే చేసుకుని రాప్‌ చేసుకునేది. అప్పుడు ప్రింటింగ్‌ స్టిక్కర్స్‌ ఎక్కువగా లేవు. అందుకే సమయం ఉన్నప్పుడు కూర్చుని అన్నీ నీట్‌గా రాసుకునేది. ఎక్కడైనా ఈవెంట్‌, ఎగ్జిబిషన్‌ లాంటివేమైనా ఉన్నాయంటే వెళ్లి అమ్మేది. పది, పదిహేను వేలతో ప్రారంభించింది. లాభం రాలేదు. కానీ పెట్టిన పెట్టుబడి వచ్చింది. ఆ ఆదాయమే మళ్లీ పెట్టుబడిగా చాక్లెట్‌ మేకింగ్‌ కొనసాగించింది. ఆ తరువాత వెబ్‌సైట్‌ ఉంటే బాగుంటుంది అనిపించి వెబ్‌సైట్‌ ప్రారంభించింది. దానివల్ల ఎక్కువ మందికి రీచ్‌ అవ్వగలిగింది. అమ్మ చేతి వంట బాగుంటుంది. ఎందుకంటే… ఇష్టంగా చేస్తుంది. శైలజ చాక్లెట్స్‌ సైతం బాగుంటాయి. ఎందుకంటే ఆమె అమ్మడానికి చేయదు. ప్యాషన్‌తో చేస్తుంది. టేస్ట్‌ అనేది గొప్ప ఆస్తి. అందుకే ఆమెకు రిటర్నింగ్‌ కస్టమర్స్‌ ఎక్కువ. ఒకసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ వస్తారు. మంచి టీమ్‌ ఆమెకు ప్లస్‌ పాయింట్‌. పర్సనలైజ్‌డ్‌ చాక్లెట్స్‌ ఆమె ప్రత్యేకత. ఇంకా ఈ బిజినెస్‌లో ఆమె కొనసాగేందుకు దోహదపడుతున్నది కూడా అదే.

రెండేండ్ల నుంచి 80 ఏండ్ల వరకు…

చిన్నచిన్న ఆర్డర్స్‌ మాత్రమే కాదు, పెండ్లిళ్లు, బర్త్‌డేలు, పండుగలు, పార్టీలు, ఈవెంట్స్‌… బల్క్‌ ఆర్డర్స్‌ కూడా చేస్తుంది. ఆమె తయారు చేసేవాటిలో నట్స్‌ చాక్లెట్స్‌ వెరీ పాపులర్‌. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు కావాల్సినవి రకరకాల ఆకారాలు. ఐదు వందలకు పైగా షేప్స్‌లో చేసిస్తుంది శైలజ. అంతేకాదు ఎవరికి కావాల్సిన ఆకారాల్లో వారికి ఇస్తుంది. సర్‌ప్రైజ్‌ గిఫ్టులు ఇవ్వాలనుకున్నవాళ్లు ఆమెకు థీమ్‌ చెబుతారు. వాళ్ల ఇష్టాయిష్టాల ప్రకారం చాక్లెట్స్‌తోపాటు పర్ఫెక్ట్‌ గిఫ్ట్‌ అందిస్తుందామె. ఏదైనా కార్పొరేట్‌ సంస్థకు వెళ్తే… ‘మీ క్లయింట్స్‌ ఎవరు?’ అని అడుగుతారు వాళ్లు. ఆమె ఇతర కార్పొరేట్‌సంస్థల పేర్లు చెప్పదు. ‘రెండేండ్ల నుంచి 80 ఏండ్ల వాళ్ల వరకు అందరూ నా క్లయింట్స్‌’ అని చెబుతుంది. కార్పొరేట్‌ సంస్థ ఇప్పుడు ఉంటుంది. తరువాత పోతుంది. కస్టమర్స్‌ అలా కాదు… ఒక్కసారి చాక్లెట్‌ తిన్నవాళ్లు ఏండ్లయినా సరే కచ్చితంగా ఏదో ఒకరోజు కావాలని వస్తారని ఆమె నమ్ముతుంది. చాక్లెట్‌ బిజినెస్‌ అనగానే… ‘హై రేంజ్‌ క్లయింట్స్‌ కష్టం. ఎలా అమ్ముదామనుకుంటున్నావు?’ అన్నారు చాలా మంది. కానీ చేసి చూపించాలన్నది ఆమె పంతం. అందుకే మాటలతో సమాధానం ఇవ్వలేదు. ‘నిజంగానే బిజినెస్‌ పెద్ద ఛాలెంజ్‌. మనకు చాలా పెద్ద సర్కిల్‌ ఉంది కదా… బిజినెస్‌ అవుతుంది అనుకోవద్దు. తెలిసినవాళ్లు కొంటారు అనుకుని బిజినెస్‌ మొదలుపెట్టొద్దు’ అంటుంది శైలజ.

దేశీ స్టైల్‌లో…

రెండు మూడేండ్ల నుంచి బిజినెస్‌ గొప్పగా లేదు. కారణం.. మార్కెట్‌లో రకరకాల చాక్లెట్స్‌. అయినా ఆమె వెనుకడుగు వేయలేదు. చేస్తున్నపనిలో వందశాతం శక్తిసామర్థ్యాలుంచితే ఏదో ఒకరోజు తప్పక మంచి ఫలితాలు వస్తాయన్నది ఆమె నమ్మకం. అది నిజమైంది. ఇటీవలే ఎయిర్‌పోర్ట్‌లో చాక్లెట్స్‌ ఉంచే ఆఫర్‌ వచ్చింది. అది కూడా సోషల్‌ మీడియా ద్వారానే. ఆన్‌లైన్‌లో ఆమె చాక్లెట్స్‌ చూసిన ఓ వ్యక్తి… ‘స్పెషల్‌గా ఏం తయారు చేయగలరు?’ అని అడిగారు. వెంటనే ఇండియన్‌ మసాలా దినుసులైన ఇలాచీ, పెప్పర్‌, దాల్చిన్‌ వంటి ఫ్లేవర్స్‌తో చేసిచ్చింది. అది సక్సెస్‌ అయ్యింది. ఇప్పుడు హైదరాబాద్‌, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో సైతం శైలూ బ్రాండ్‌ చాక్లెట్స్‌ దొరుకుతాయి.

చేయలేను అనే మాట వద్దు…

’20, 30 వేలతో ఈ బిజినెస్‌ ప్రారంభించొచ్చు. జాగ్రత్తగా మార్కెటింగ్‌ చేసుకోవాలి. ఫుడ్‌ ప్రాడక్ట్‌ కాబట్టి దాంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. రోజుకు మూడునాలుగు కేజీలు అమ్మగలిగితే చాలు.

నాకు బిజినెస్‌ ఫైనాన్షియల్‌గా పెద్దగా హెల్ప్‌ చేయలేదు. కానీ మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగాలంటే మాత్రం ఏదో ఒకటి చేయాలి. ఇంట్లో కూర్చుని ‘అది చేయగలను, మౌంట్‌ ఎవరెస్ట్‌ ఎక్కగలను’ అంటే ఎవరు నమ్ముతారు. అవకాశం రావాలంటే మనం బయటికి రావాల్సిందే తప్పదు. బయటికి వచ్చిన పనిచేయడం మొదలుపెడుతున్నప్పుడే మనలో ఉన్న శక్తి మనకు తెలిసేది. ఏదో ఒక దగ్గర ప్రూవ్‌ చేసుకోవాలి. అందుకోసం ఏదో ఒకటి చేయాలి. నలుగురు ఎంటర్‌ప్రెన్యూర్స్‌ మధ్యలోకి వెలితే కొత్తలో చాలా భయం వేసేది. కానీ చాక్లెట్‌ బాగా చేయగలను అనే నమ్మకం ఆ భయాన్ని అధిగమించేలా చేసింది. ఎవరి పరిధిలో వాళ్లకు రకరకాల భయాలు ఉంటాయి. ప్రతి మహిళా ‘ఐ మేకింగ్‌ ది డిఫరెన్స్‌’ అనుకోవాలి. ప్రస్తుతం చాక్లెట్‌ బిజినెస్‌ అంతగా బాలేదు. అలా అని నేను అక్కడితో ఆగిపోలేదు. కొనసాగించాను. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. కానీ ఇటీవలే ఓ ఈవెంట్‌ సక్సెస్‌ఫుల్‌గా చేశాను. నువ్వు చేయగలిగిన పనేదయినా… చేయి. ఐదు వందలు సంపాదించినా చాలు. ఆ ఐదొందలతో ఏం చేయాలనే మరో ఆలోచన వస్తుంది. ఆ తరువాత సక్సెస్‌ వస్తుంది. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా… ఎన్ని ఒడి దుడుకులు ఉన్నా సాగిపోతూనే ఉండాలి. ‘నేను చేయలేను’ అనే మాట మన నోటివెంట రాకూడదు. కుటుంబ సహకారం కూడా చాలా ముఖ్యం. ఈమొత్తం ప్రయాణంలో మావారు కృష్ణకుమార్‌ చాలా సపోర్టుగా ఉన్నారు’

– కట్ట కవిత

Source : http://epaper.navatelangana.com/c/17583245